Skip to main content

Posts

నాగావళి

నేను పుట్టక ముందే తాను తరగలెత్తింది నేను పెరగక ముందే తాను నురగలెత్తింది నాలో ఆనందాల తెర చాపలెత్తి నన్ను పడవను చేసి ఆడించింది నాలో సంతోషం ఉరకలేస్తే తాను జల జలా పారింది నాగావళి నాలో విషాదం ఆవరిస్తే తాను ఇంకిపోయి చెలమలయ్యింది నాగావళి నా బాల్యంలో జోల పాడి నా కౌమారంలో ఈలలూది నా యవ్వనంలో నన్ను ఊగించి,శాసించి, రక్షించి నా బతుకు బాటలో పాటయ్యింది నాగావళి నా విజయంలో తుళ్ళింతగా చేరి నా అపజయంలో కన్నీటి చుక్కగా మారి నన్ను అల్లుకుంది బంధమై పూల తీగలా తాను కదిలింది నాతో కలసి తేనె వాగులా...
Recent posts

పని దొరికింది

ఎలచ్చన్లు వత్తన్నాయి ఊరిలో ఓటరన్నకు  పని దొరికింది అదే... ఐదేళ్లకోసారి వచ్చే పని జెండాలు ఊపే పని చప్పట్లు కొట్టే  పని ఈలలు వేసే పని కేకలు వేసే పని ఉదయం ఒకరికి జై ఆనే పని సాయంత్రం ఇంకొకరికి సై అనే పని అర్ధం పర్ధం లేని ఊకదంపుడు ఉపన్యాసాలు  వినేపని... ఆ పని కోసం... ఎండలో ఎండిపోతాడు  అచ్చం వాడి కడుపులానే ... వానలో తడిసిపోతాడు కాకపోతే వాగ్దానాల వానలో.. నువ్వు కూడా నా వెంట రావాల్రా .. అని నాయకుడనే సరికి తనే ఒక పెద్ద నాయకుడిలా మారిపోతాడు ఎదురు పడి ఓ దండం పెట్టేసరికి వరమిచ్చే  దేవుడిలా మారిపోతాడు అరిచి అరిచి  అలసి సొలసి సాయంత్రం గూటికి చేరిపోతాడు జేబులో కాసిన్ని డబ్బులతో కడుపులో కాసిన్ని మందు నీళ్ళతో భలే పని దొరికిందని ఇలాగే బాగుందని మురిసిపోతాడు ముప్పేట జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం మానేసి ఉప్పెనలా ముంచుకొస్తున్న సమస్యల్ని గాలి కొదిలేసి ... రాత్రి నిద్దరోతాడు తెల్లారేసరికి ఏ జండా పట్టుకోవాలా ఆలోచిస్తూ...     ఆ రోజుకు రెక్కలు ఆడాయి కనుక రేపటి రోజుల్లో బతుకు మెతుకుల మాట గతుకు గతుకుల బాటను మర్చిపోతాడు ఈలోగా నాయకుడు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి అయిపోతా

రేపటి వెలుగుల కోసం

అమ్మ జన్మ నిచ్చింది మట్టిని ముట్టుకోమని గట్టిని తట్టుకోమని లోకాన్ని జయించమని అమ్మ ఊపిరి పోసింది ఈ జగతికి ప్రాణం ఇమ్మని ఈ విశ్వానికి ప్రాణం కమ్మని వీలైతే ప్రణవంగా నిలవమని కను రెప్పలు చూడాల్సింది ఉషోదయాలనే కాదు నిశా దిశలను కూడా గుండెలో ఉండాల్సింది నిరాశా నిస్పృహలు కాదు ఆశల మోసులు ఇంద్రధనస్సు  లాంటి రేపటికోసం వింటిని విడిచిన శరమై సాగాలి నింగిని విడిచిన వర్షమై విస్తరించాలి ఉదాయాలను పంచే కిరణమై వెలగాలి కనురెప్పలు మూయడం కలల కోసమే కావాలి తప్ప కలతలతో కన్నీళ్ళతో బలవన్మరణానికి కాకూడదు  విరిసే పువ్వు  మొగ్గలోనే వాడిపోకూడదు ఉదయకిరణాలు అర్ధంతరంగా  అస్తమించకూడదు చీకటిని ఎదుర్కొని రేపటి వెలుగుల కోసం ఎదురుచూడాలి ధైర్యంగా స్థైర్యంగా..

విభజన వాయిదా

మునగాల మనదే మణుగూరు మనదే భద్రాద్రి మనదే వెంకటాద్రి మనదే తెలంగాణ మనదే రాయలసీమ మనదే కోస్తాంధ్ర మనదే మొత్తంగా సమైక్యాంధ్ర మనదే అడ్డే వాడెవ్వడు అడ్డు చెప్పేవాడెవ్వడు కాదన్న వాడెవ్వడు సమైక్యతను వద్దన్నవాడెవ్వడు ఎందుకీ శుష్క  వాదనలు ఎందుకీ అనవసర వివాదాలు బహిష్కరిద్దాం వేర్పాటు వాదులను ఒక్కటి చేద్దాం సమైక్య వీరులను వాయిదా వేద్దాం విభజనను ఓ జీవితకాలం.. కలసే ఉందాం కలకాలం

అమ్మ నేల

దేశ మాత  సిగలో అనగనగా ఓ ముత్యం అన్న పూర్ణగా సుప్రసిద్ధం చిరునవ్వుల సిరిమువ్వలు విరిజల్లులై రాలిన స్వర్గం గోదావరి కృష్ణమ్మ పెన్నమ్మ వంశ ధారలు పారాడే పవిత్ర స్థలం తెలంగాణ రాయలసీమ కోస్తా ఉత్తరాంధ్ర అంగాలై అలరారిన పవిత్ర దేహం నన్నయాది కవులకు పోరాట వీరులకు సంఘసంస్కర్తలకు స్వాతంత్ర్య యోధులకు సంస్కృతీ సౌరభాలకు నిలయమైన దేవాలయం పేరు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తీరు దేశానికే ఆదర్శం ఏ వేర్పాటు  దెయ్యం పూనిందో ఏ  విభజన  అమావాస్య కమ్మిందో ఏ రాజకీయ  రక్కసి  కాటేసిందో ఏ  ద్రోహానికిబలి అయ్యిందో అమ్మనేల వీడిపోతోంది ముక్కలు చెక్కలైపోతోంది తెలుగు నేలంతా కన్నీళ్ళు కాలువలు కడుతున్నాయి ఆవేదన అవధులు దాటుతోంది సగటు తెలుగు గుండె మండుతోంది అ  నుంచి అం  అః క నుంచి బండీరా అక్షరాల సాక్షిగా కోట్లాది గుండెలన్ని ఒక్కటంటు నమ్మిన హృదయం వేరుపాటుపేల్చిన పేలుడికి ఉలికులికి పడుతోంది అన్నం సహించడం మానేసింది ఆకలి నిద్ర దూరమయ్యింది ఎవరు రాస్తున్నారీ తెలుగు వాడి తలరాత ఎవరు చేస్తున్నారీ విధ్వంసపు కోత ఎవరు చేసిన పాపం ఇది ఏ విధాత విసిరిన శాపం ఇది ఎందుకు నా కన్నతల్లికి ఈ కష్టం ఎందుకు

కుటుంబ దీపావళి

అమ్మ... ఆత్మీయ దీపం నాన్న... ఆప్యాయ దీపం అక్క... చక్కని దీపం చెల్లి... అల్లరి దీపం అన్న... వెన్నెల  దీపం తమ్ముడు.. కమ్మని దీపం ఇలా మన ఇంట్లో  నిత్యం దీపావళి వెలుగులే                                                                                     అనురాగాల  జిలుగులే                                                                                    (దీపావళి శుభాకాంక్షలతో)

పడమట రాలిన పుష్పం

వేల మైళ్ల అవతల పడమటి వీధిలో ఇక్కడ సూర్యుడు అస్తమించాక అమెరికా లో అమావాస్య కమ్మేసింది అమానుషంగా పెచ్చరిల్లిన ఓ మానవ మౄగం అభం శుభం తెలీని పసిపువ్వును చిదిమేసింది పసిపాప కనుపాపలో కమ్మని కలలను కాటేసింది పాలకోసం పారడే పాపను అయ్యో పాపం అనుకునేలా అంతం చేసింది చిట్టి చేతుల చిన్నారి తల్లిని చేజేతులా నలిపేసింది పొత్తిళ్లు దాటని పసిగుడ్డును నెత్తుటి మూటగ మార్చడానికి ఆ మౄగానికి మనసెలా వచ్చిందో... ఇదే ఆవేదన అందరిలో కారణం ఏదైనా కావొచ్చు...కానీ  ఇది దారుణం అంటు జనత గుండె ఘొషించింది మనిషి మాయమవుతున్నడని మానవత్వం కనుమరుగవుతుందన్న చేదునిజాల సాక్షిగా తనలాంటి పసిపువ్వుల చిరునవ్వులు కాపాడమంటు..వేడుకొంటూ చిన్నారి శాన్వీ నింగికెగసింది... కన్నీళ్ళతో పాటూ సమాధానాలు తేలని ప్రశ్నలను కూడా మిగులుస్తూ... (అమెరికాలో చిన్నారి శాన్వీ హత్యకు వేదనగా)