Skip to main content

Posts

Showing posts from January, 2014

రేపటి వెలుగుల కోసం

అమ్మ జన్మ నిచ్చింది మట్టిని ముట్టుకోమని గట్టిని తట్టుకోమని లోకాన్ని జయించమని అమ్మ ఊపిరి పోసింది ఈ జగతికి ప్రాణం ఇమ్మని ఈ విశ్వానికి ప్రాణం కమ్మని వీలైతే ప్రణవంగా నిలవమని కను రెప్పలు చూడాల్సింది ఉషోదయాలనే కాదు నిశా దిశలను కూడా గుండెలో ఉండాల్సింది నిరాశా నిస్పృహలు కాదు ఆశల మోసులు ఇంద్రధనస్సు  లాంటి రేపటికోసం వింటిని విడిచిన శరమై సాగాలి నింగిని విడిచిన వర్షమై విస్తరించాలి ఉదాయాలను పంచే కిరణమై వెలగాలి కనురెప్పలు మూయడం కలల కోసమే కావాలి తప్ప కలతలతో కన్నీళ్ళతో బలవన్మరణానికి కాకూడదు  విరిసే పువ్వు  మొగ్గలోనే వాడిపోకూడదు ఉదయకిరణాలు అర్ధంతరంగా  అస్తమించకూడదు చీకటిని ఎదుర్కొని రేపటి వెలుగుల కోసం ఎదురుచూడాలి ధైర్యంగా స్థైర్యంగా..