Skip to main content

Posts

Showing posts from 2012

కుటుంబ దీపావళి

అమ్మ... ఆత్మీయ దీపం నాన్న... ఆప్యాయ దీపం అక్క... చక్కని దీపం చెల్లి... అల్లరి దీపం అన్న... వెన్నెల  దీపం తమ్ముడు.. కమ్మని దీపం ఇలా మన ఇంట్లో  నిత్యం దీపావళి వెలుగులే                                                                                     అనురాగాల  జిలుగులే                                                                                    (దీపావళి శుభాకాంక్షలతో)

పడమట రాలిన పుష్పం

వేల మైళ్ల అవతల పడమటి వీధిలో ఇక్కడ సూర్యుడు అస్తమించాక అమెరికా లో అమావాస్య కమ్మేసింది అమానుషంగా పెచ్చరిల్లిన ఓ మానవ మౄగం అభం శుభం తెలీని పసిపువ్వును చిదిమేసింది పసిపాప కనుపాపలో కమ్మని కలలను కాటేసింది పాలకోసం పారడే పాపను అయ్యో పాపం అనుకునేలా అంతం చేసింది చిట్టి చేతుల చిన్నారి తల్లిని చేజేతులా నలిపేసింది పొత్తిళ్లు దాటని పసిగుడ్డును నెత్తుటి మూటగ మార్చడానికి ఆ మౄగానికి మనసెలా వచ్చిందో... ఇదే ఆవేదన అందరిలో కారణం ఏదైనా కావొచ్చు...కానీ  ఇది దారుణం అంటు జనత గుండె ఘొషించింది మనిషి మాయమవుతున్నడని మానవత్వం కనుమరుగవుతుందన్న చేదునిజాల సాక్షిగా తనలాంటి పసిపువ్వుల చిరునవ్వులు కాపాడమంటు..వేడుకొంటూ చిన్నారి శాన్వీ నింగికెగసింది... కన్నీళ్ళతో పాటూ సమాధానాలు తేలని ప్రశ్నలను కూడా మిగులుస్తూ... (అమెరికాలో చిన్నారి శాన్వీ హత్యకు వేదనగా)

అమ్మకు జేజేలు

అమ్మా ఎలా కన్నావు నన్ను నన్ను నన్నుగా ఎలా చూపించావు నిన్ను నిన్నుగా చూడలేక నేను నేనుగా బతకలేక వేగిపోతున్న నన్ను ఎలా కన్నావు ఈ భూమిమీద నేను పడ్డప్పుడు నేను ఇలా ఉండాలని అనుకున్నావా అసలు నేను మనిషినేనా పాలు తాగి రోమ్ముగుద్దే నన్ను ఎలా కన్నావు తిన్న అన్నం ముద్దల్లో కూడా విశ్వాసం  కురిపించలేని నన్ను ఎలా కన్నావు  పట్టుకొని నడిచే వేలుని విరిచే నన్ను ఎలా పెంచావు నడవలేని నిన్ను నీ మానాన వదిలేసే నన్ను ఎలా కన్నావు ఎలా పెంచావు ఈ నేలను ప్రేమించక నీతిగా నడవక నలుగురిలో నవ్వుల పాలయ్యే నన్ను ఎలా కన్నావు ఒక లక్ష్యం లేక ఒక సాధన లేక దేశం పై పడి పెచ్చరిల్లే పెల్లగిల్లే ఈ అతివాదిని ఎలా కన్నావు ఎలా  భరిస్తున్నావు అందుకే అమ్మ  ధరణీ నీ ప్రేమకు నీ ఓర్పునకు వేన  వేల జేజేలు 

పచ్చల పతకం

అక్షరాల సుమాలను పదాల పాదాలతో వాక్యాల  పధాలపై పరిగెత్తే కెరటం ప్రసరించే కిరణం అంకెల లంకెలలో  కూడికలై తీసివేతలై గుణకారమై   భాగాహారమై నాదమై వాదమై సంఖ్యా సిద్ధాంతమై  అగణితమై గణితమై విరజిమ్మే పవనం విరాజిల్లే చైతన్యం  విత్తుగా  మొలకెత్తి వృక్షమై విస్తరించి విద్వత్తును విద్యుత్తుగా  మలిచి విశ్వాన్తరాళా లను  వలిచే విజ్ఞాన తరంగం సుజ్ఞాన విహంగం గురువంటే మానవత  గురువంటే సమత గురువంటే శక్తి గురువంటే స్ఫూర్తి గురువంటే రాజ్యాంగం గురువంటే జాతీయగీతం గురువంటే ఎగరేసే  విజయపతాకం గురువంటే ధరణి సిగలో పచ్చల  పతకం ....

మోసపు పోటు

  ముప్పై ఏళ్లుగా చీకటి నింపుకున్న జీవితం  వెలుగు కోసం ఆశగా ఎదురు చూపులు చూస్తున్న ప్రాణం మీరు ముందురోజు విడుదల అంటే సరబ్జీత్ కుటుమ్బమే కాదు యావద్భారతమే ఆకాశమంత  ఉప్పొంగిపోయింది కళ్ళల్లో వత్తులు వేసుకుంది మేళ తాళాలు స్వాగతానికి సిద్ధం చేసుకుంది మూడు దశాబ్దాలుగా కొడుకు కోసం ఎదురు చేస్తున్న తల్లి మురిసిపోయింది  ఆ మర్నాడే తూచ్ పేరు తప్పు అని ప్రకటించిన మీ మానవత్వానికీ  మీరు చూపిన విజ్ఞతకు కుంగిపోయింది ... అదిగో ఇదిగో అని చెప్పడానికి ఇది దొంగాట కాదు ఏమో ఏమో అని చెప్పడానికి ఇది సందేహం కాదు ఓ సారి విడుదల అని చెప్పి మరోసారి సారీ అని చెప్పడానికి ఇది ఆట్లాట కాదు బతుకుతో పోరాడుతున్న ఓ భారతీయుడి వేదన నలిగిపోతున్న గుండెలపై మీరు దింపిన మరో మోసపు పోటు శత్రువులా మారిన దాయాది నేస్తమా నీకిదే మా విన్నపం నువ్వు  నవ్వించక పోయినా పర్వాలేదు మమ్మల్ని ఏడిపించక పొతే చాలు  నువ్వు మాకు స్నేహహస్తం చాచక పోయినా పర్వాలేదు సమ్మెట పోటు పొడవక పొతే చాలు   

వంద వందల వందనం

                                                     గుండెల్లో అశోకచక్రాన్ని నింపుకొని కాళ్ళకు చక్రాలు తొడుక్కొని అతను పరుగులు తీస్తుంటే కళ్ళల్లో జాతీయ పతాకాన్నిఅద్దుకొని వంద కోట్ల ఆశలు ఆవహించి అతను విజయం వైపు గర్వంగా నడుస్తుంటే చేతిలో చెక్కముక్కను ఉక్కుముక్కలా మార్చి బంతిని పూలచెండులా మలిచి అతను ఆటను ఆడే తీరుకు మువ్వన్నెల పతాకం కూడా ముచ్చటపడి రెక్కలు కట్టుకొంటూ జాతి ఖ్యాతిని మోసుకొంటూ నింగికి ఎగిరిపోతుంది ఆటను ఆటగా కాకుండా తపస్సులా ఆతను భావిస్తాడు ప్రతి పరుగును జాతికి అంకితమిస్తాడు సచివుడిగా సచినుడిగా మైదానంలో సింహంలా మాటలో మృదువుగా వ్యక్తిత్వంలో ఎవరేష్ట్ లా  ఎదిగి ఎదిగిన కొద్ది ఒదిగిన సమున్నత ముర్తిమత్వపు సగర్వ రేఖాచిత్రం సచిన్ ఒకటో వంద నుంచి వంద వందల వరకు చేసిన ప్రయాణంలో ఒక్క రోజు కూడా అలిసిపోని ఆగిపోని ఆనంద  ప్రవాహం అందుకే ఆ పరుగుల వీరుడికి భారత జాతి ముద్దు బిద్దడికి                              చేస్తున్నా వంద వందల వందనం            .

ఎక్కడ ఉగాదులు

తేట తెలుగు పలికినందుకు ఒంటిపై వాతలు తేలుతున్నాయి అమ్మ,  నాన్న అని పిలుస్తుంటే అవమానాలు మొదలయ్యాయి భాషకు ప్రాణమైన మహా ప్రాణాలు పలకడానికి ప్రాణాలు పోతున్నాయి ఒత్తులు పలకలేక జీవన వత్తులు వెల వెలబోతున్నాయి దీర్ఘాలు చెప్పలేక గుణింతాలు పలకలేక తెలుగు కంటే పరభాష సుఖమని పరవశించి పోతుంటే  ప్రభుత్వాలు కూడా అమ్మ భాషను కాపాడలేక చేతులు ఎత్తేస్తుంటే ఉగాది శుభ కామనలు కూడా స్వభాషలో తెలుపలేకపోతుంటే తెలుగు దినాన్ని కూడా ఆంగ్లవత్సరంలా జరుపుతుంటే ఇక మన తెలుగు జాతికి ఉగాదులు ఎక్కడ ఉషస్సులు ఎక్కడ..? 

ఆరు రుచుల సోయగం

  పరిమళాల పచ్చదనం వేపపూల సోయగం పలకరించు కోయిల పరవసించు మనసిలా ఆరు రుచుల కమ్మదనం తెలుగు లోని  తియ్యదనం తెలియజేయు ప్రకృతి పరిణమించు ఆకృతి కాటేసిన ప్రపంచీకరణం వసివాడిన పర్యావరణం మింగబోదు ఉగాదిని ఏనాటికి ఇదే నిజం ఇదే నిజం ముమ్మాటికీ మన భూమి మన జాతి మన తెలుగు మన వెలుగు మన జన్మ మన అమ్మ మన జవం మన జీవం మన సంస్కృతి కావాలి మన ఖ్యాతే జగమంతా జేగంటై మోగాలి

పరిణామం

ఇప్పుడు మేలుకొలుపు పాటను సెల్ ఫోన్ పాడుతోంది కొమ్మల్లో కోయిలమ్మ గొంతు చించుకుంటొంది టీవీ నాయనమ్మ తన ఎలక్త్రానిక్ గొంతుతో కార్టూన్ కథలు జేంస్ బాండు చరిత్రలు వినిపిస్తోంది ఊరునూ వాడను క్రికెట్ వర్షం తడిపేస్తోంది కబాడీ బిళ్ళంగోడి కాగితం పడవలయ్యాయి రేడియేషన్ మింగేసి పిచ్చుకమ్మ నిద్దరోతోంది ఈ జన్మకు లేవలేనంతగా కాలం వాయువేగంతో కదలి పోతోంది సంస్కృతి పాతాళానికి జారిపోతోంది ఇది కాల పరిణామం అంగీకరించాలో తిరస్కరించాలో తెలియని తీవ్ర అయోమయం

ప్రేమ

రెండక్షరాల ప్రేమ రెండు జీవితాల ప్రేమ రెండు బతుకుల్లో నిండు ప్రేమ వేల నవ్వులు వెలిగించు ప్రేమ మనసు నింగిలో మెరిసే మేఘం తనువు ధనువుపై కురిసే వర్షం

ప్రేమను వెలివేయండి

ఆనందాలు ఆహ్లాదాలు గత స్మృతులుగా మారే చోట ఛీత్కారాలు ఛీదరింపులు బహుమతులుగా అందేచోట నల్లగా ఉండడం బైకు లేకపోవడం నిరంతర వేదనలైన చోట సెంట్ పర్సెంటులు, షీల్డులు గతకాలపు జ్ఞాపకలుగా  మిగిలిన చోట  అమ్మ నాన్నల కలలు కల్లలు గా  ఆశలు అడియాసలు గా మారిన చోట  వెలివేయండి వెలివేయండి  ఈ పా డులోకపు ప్రేమను వెలివేయండి వెలివేయండి 

కొత్త ఆశ

మన బతుకుల్లో మరో ఉదయం 365రోజులు సాగిపోయే పయనం వచ్చేది వసంతమో శిశిరమో తెలియదు తెచ్చేది తేనె ఊటో చేదు విషమో తెలియదు పంచేది అమృతమో హాలాహలమో తెలియదు ఐనా చిగురించిన ఆశలతో మొలకెత్తిన ఆశయాలతో సాగిపోదాం కాసిన్ని మంచి, మానవతలనే చల్లని చినుకులు సమాజంపై  చిలకరించి పోదాం...