Skip to main content

పని దొరికింది

ఎలచ్చన్లు వత్తన్నాయి
ఊరిలో ఓటరన్నకు 
పని దొరికింది
అదే... ఐదేళ్లకోసారి వచ్చే పని
జెండాలు ఊపే పని
చప్పట్లు కొట్టే  పని
ఈలలు వేసే పని
కేకలు వేసే పని
ఉదయం ఒకరికి జై ఆనే పని
సాయంత్రం ఇంకొకరికి సై అనే పని
అర్ధం పర్ధం లేని ఊకదంపుడు ఉపన్యాసాలు  వినేపని...
ఆ పని కోసం...
ఎండలో ఎండిపోతాడు
 అచ్చం వాడి కడుపులానే ...
వానలో తడిసిపోతాడు
కాకపోతే వాగ్దానాల వానలో..
నువ్వు కూడా నా వెంట రావాల్రా ..
అని నాయకుడనే సరికి
తనే ఒక పెద్ద నాయకుడిలా మారిపోతాడు
ఎదురు పడి ఓ దండం పెట్టేసరికి
వరమిచ్చే  దేవుడిలా మారిపోతాడు
అరిచి అరిచి  అలసి సొలసి
సాయంత్రం గూటికి చేరిపోతాడు
జేబులో కాసిన్ని డబ్బులతో
కడుపులో కాసిన్ని మందు నీళ్ళతో
భలే పని దొరికిందని
ఇలాగే బాగుందని మురిసిపోతాడు
ముప్పేట జరుగుతున్న అన్యాయాన్ని
ప్రశ్నించడం మానేసి
ఉప్పెనలా ముంచుకొస్తున్న సమస్యల్ని
గాలి కొదిలేసి ...
రాత్రి నిద్దరోతాడు
తెల్లారేసరికి ఏ జండా పట్టుకోవాలా ఆలోచిస్తూ...    
ఆ రోజుకు రెక్కలు ఆడాయి కనుక
రేపటి రోజుల్లో బతుకు మెతుకుల మాట
గతుకు గతుకుల బాటను మర్చిపోతాడు
ఈలోగా నాయకుడు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి అయిపోతాడు
అప్పుడు మరో కొత్త పని దొరుకుతుంది
కూడు కోసం గూడు కోసం
అర్జీలు పెట్టుకొనే పని
భవిత కోసం భద్రత కోసం
అంగలార్చే పని
రోడ్డు కోసం...  రోజు కూలి కోసం
కాళ్ళరిగేలా తిరిగేపని
బిడ్డ పాప  చదువుకోసం
గొడ్డూ గోదా  మేత కోసం
సర్కారి చదువుకోసం, వైద్యం కోసం
మొరపెట్టుకొనే పని
పంట పండడం  కోసం
ఆకలి మంట తీరడం  కోసం
కాళ్ళరిగేలా తిరిగే పని
కరువు తీరా ఎరువుల కోసం
పురుగులపై పనిచేసే మందుల కోసం
యమయాతన పడే  పని
అలా అలా అలలా ఐదేళ్ళు గడిపేసే పని... 
మళ్ళీ అప్పుడు ఎలచ్చన్లు  వస్తాయి
అప్పుడు మళ్ళీ  ప్రవేశిస్తాడు
' పని' లోకి... వాగ్దానాల గనిలోకి ...














Comments

Popular posts from this blog